నేను కడపలో వుండి KSRM ఇంజనీరింగ్ కాలేజీలో 1993-1997 సంవత్సరాలలో చదివినాను. 1995లో మొదటిసారి దర్గాకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు అయన పాదాలయందు శరణుపొందినందుకు అన్నిరకాలుగా తృప్తిగా జీవనం జరుగుతున్నది. ఒక సందర్భంలో మా నాన్నగారికి స్వామి చెప్పినారు "మా కడుపులో పెట్టుకొని సొంత బిడ్డలా చూసుకుంటాము నయనా". దర్గాకు రావటం మొదలైనాక 5-6 సంవత్సరాలకు ఒక ప్రశ్న రావటం మొదలైంది. దర్గాకు రావటానికి ఆకర్షణ ఏమిటి? ఎవరైనా ఏదైనా కష్టం వస్తే అది తీరేదాకానో, లేదా కోరిక తీరేదాకానో వస్తారు. ఇన్ని సంవత్సరాలు అయినా మరల మరల వచ్చి వెళ్లాలని మనసులో ప్రోద్బలం ఎందుకు కలుగుతుంది? చాలాసార్లు వచ్చి వెళ్ళటానికి ఒక కష్టమో లేక కోరికో ఏమిలేదు. కేవలం వచ్చి ఒకటి రెండు రాత్రులు నిద్దుర చేసి వెళ్లాలని రావటమే. కొంతకాలం మనసులో ప్రశ్న ఆరాటపెట్టినాక స్వామి ప్రేరణతో మనసులో కలిగిన సమాధానం ఇది.
"మనః ఏవ మనుష్యాణాం బంధ మోక్షయోః కారణం" మనిషి మనసే ఆతని బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. స్వామి ఇంకా సరళంగా చెప్పేవారు "నాయన, ఆలోచనే శత్రువు." ఆశ్రమంలోకానీ, స్వామి సన్నిధిలో కానీ ఆలోచన నిలబడిపోతుంది. ఇది అందరికి అనుభవ్మైయే విషయమే అయినా..అర్థం చేసుకొని మాటలలో చెప్పటానికి కొంత సమయం పడుతుంది. ప్రశ్నఅడగటానికి వచ్చిన వారిని "అయ్యో, ఇది ఒకటి అడిగాను, ఇంకొకటో, కొన్నో అడగటం మరచిపోయాను. మళ్ళి వెళ్లి అడగవచ్చా" అని అడిగేవారిని ఎంతోమందిని చూసాను. స్వామి ఎదురుగ కూర్చున్నప్పుడు ఇది ఇంకా ప్రస్ఫూటంగా, ప్రబలంగా అనుభవమైతుంది.
ఒకసారి స్వామి అడిగారు "నాయన, ఇన్నేళ్ల నుంచి వస్తున్నావు, నీకేమనిపిస్తుంది అని?". నా లోపలి నుంచి వచ్చిన సమాధానం నన్ను విస్మయపరిచింది. ఇది ఎదో బాగా అలోచించి, విచారించి చెప్పిన సమాధానం కాదు. చాల spontaneousగా వచ్చిన సమాధానం "స్వామి ఇంట్లో ఎన్నో పుస్తకాలూ చదువుతాను, ఆలోచన చేస్తాను. స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇవి అడగాలి, వీటిని అర్థం చేసుకోవాలి అని. ఇక్కడకు వచ్చి మీ ముందు కూర్చున్నప్పుడు మనసులో ఏ ఆలోచనా ఉండదు. ఏ ధ్యాస, ఏ స్ఫూరణ ఉండదు".
ఇంకొక సందర్భంలో స్వామి చెప్పారు, "నాయన, వాక్మౌనం, మనోమౌనం రావాలి అని" ముందర వాక్మౌనం వస్తుంది. ఎక్కువ మాట్లాడాలి అనిపించదు. మనలో మనకి తృప్తిగా ఉంటుంది. పూర్ణమైన మనోమౌనం అనుభవమైతే కాలేదు కానీ..అనుభవమైన కొద్ది మనోమౌనం స్వామి సన్నిధిలో కలిగినదానికి ఎంతో తృప్తి కలుగుతుంది. ఈ మౌనంలో శరీరానికి పుష్టి, ఆరోగ్యం కలుగుతుంది. మరల ఆశ్రమ౦ నుంచి సంసారంలోకి వచ్చాక ఈ అనుభవం తగ్గుతూ వస్తుంది. ఒక బాటరీ డిశ్చార్జ్ అయ్యే మాదిరి. ఒక నెల అయినా తరువాత..మరల స్వామిని చూడాలి అనిపిస్తుంది. ఆశ్రమానికి వెళ్తే ఛార్జ్ అయ్యినట్టుంటుంది. ఇదే కీలకం. దీని కోసమే మరల మరల దర్గాలో ఆశ్రమానికి వెళ్లాలని మనసు ఆకర్షితము అవుతుంది. వస్తువిషయ సంపత్తి నుండి సంగతి దూరమైతేగాని మౌనం అలవడదు.
యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః
యస్య చిత్తం రమతే బ్రాహ్మణి నందతి నందతి నన్దత్యేవ.
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభీజాయతే
క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహత్ స్మృతిబ్రహ్మంశాయ
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాయ బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
గమనిక: ఈ అనుభవాలు అందరికి ఒకే రకంగా ఉండాలి అని లేదు. ఎవరి స్వభావం బట్టి వారి వారి సాధనా మార్గాలు ఉంటాయి.
----------------------------------------------------------------------------------------------------------------
2003లో మొదటిసారి స్వామి చెప్పారు "నాయన, రాత్రి ఉండి మర్నాడు పగలు వెల్దువు గానీ. అమ్మయ్య పెరుగుఅన్నం పెడుతుంది, తిని వెళ్ళు" అప్పట్లో కొంత మొహమాటమో? , అసౌకర్యంగా ఉంటుందేమో అని సంకోచమో? బాగా గుర్తులేదు కానీ, ఏదైతే ఏమి స్వామి మూడుసార్లు చెప్పినా ఉండకుండా వచ్చేసాను. తరువాతి సారి వెళ్ళినప్పుడు, స్వామి చెప్పారు "ఉండమంటే వెళ్ళిపోతివి. అమ్మయ్య పెట్టిన పెరుగన్నం తిని వెళ్ళివుంటే నీకు మనసు ఏకాగ్రత కలిగేది". తరువాతి సంవత్సరాలలో ఈ సంఘటన తలుచుకుని ఎన్నోసార్లు బాధపడ్డాను. "అయ్యో, మంచి అవకాశం పోగొట్టుకున్నాడు అని." బహుశా అదే ఆఖరి సందర్భం అనుకుంట స్వామి మాట జవదాటింది. అప్పటినుంచి స్వామి "ఊఁ.." అన్నాచాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మాట జవదాటకుండా చెప్పినది చెప్పినట్టు అమలు చెయ్యటానికి పరిశ్రమ మొదలైంది. ఇది చాల పెద్ద పాఠం. ముఖ్యమైన పాఠం.
తరువాత కొన్ని సంవత్సరాల తరువాత ఇతర గురుబంధువులతో అనుభవాలు పంచుకుంటునప్పుడు, ఈ రకమైన అనుభవం ఐదారు మంది చెప్పారు. స్వామి ఎదో చెప్పారు, మేము జాగ్రత్తగ విని నడవలేదు, దానివల్ల కొంత కష్టమో నష్టమో పడ్డాము అని. విచారంచి చూడగా అర్థమైయేదేంటంటే ఒక రుపాన్ని గురువుగా ఎంచుకుని సమర్పణ చేసినాక, అయన మాట జవదాటక నడచుకోవటం అనేది మొట్టమొదటి పాఠం. మనకు గురువు చెప్పింది అర్థం అయినా, అవ్వకపోయిన అయన చెప్పినదానిలో మన శ్రేయస్సు ఉంటుంది అనే ధృడవిశ్వాసంతో నడవాలి. ఈశ్వరప్రాప్తికి సర్వమూ సమర్పణ చేసి, అన్ని గుణాలను నెగ్గిన వానికి స్వార్థం ఏమి వుంటింది. వారు ఏదైనా చెపితే అందులో కేవలము మన శ్రేయస్సు మాత్రేమే వుంటింది.
------------------------------------------------------------------------------------------------------------------
ఒకసారి స్వామి, చెన్నై గోవర్ధన్, నేను ఉండగా స్వామి మాట్లాడటం మొదలుపెట్టారు. చేతివేళ్ళు మడచి, తిప్పి కణపులను వాటి మధ్య గుంతలను చూపి మా చిన్నతనంలో ఇట్లా నేర్పించేవారు, జనవరి 31 రోజులు - కణుపుతో మొదలై, ఫిబ్రవరి 28 రోజులు - గుంత, ఈ విధంగా..నేను ఆసక్తిగా గమనిస్తూ..స్వామి మాట్లాడుతున్నారు కదా మనం కూడా ఏదన్న చెప్పవచ్చు అని..స్వామి మన రాష్ట్రంలో (తెలుగు రాష్ట్రంలో, అప్పటికి ఇంకా విభజన కాలేదు) చాంద్రమానం, తమిళనాడులో సూర్యమాణము పాటిస్తారు కదా..అని చెప్పబోయాను. వాక్కు నాభి నుండి ప్రారంభం అవుతుంది. అది హృదయానికి, కంఠానికి చేరి చివరికి ముఖం ద్వారా బయటకు వస్తుంది. నా మాట ఇంకా పూర్తిగా కంఠంలోనుండి బయటకు రాలేదు, స్వామి ఠక్కున, పదునుగా నా వంక చూస్తూ, "నాయన రోజు సంధ్యవారుస్తావా?" అని అడిగారు. నాకు భలే ఆశ్యర్యం వేసింది, నా వాక్కు శబ్దంగా ఇంకా బయటకు రాకుండానే స్వామి గ్రహించి స్పందించారు. జీవితంలో రెండవ పెద్ద పాఠం, గురువుతో ఎప్పడూ లౌకికులతో చేసినట్టు సంభాషణ చెయ్యకూడదు. గురువు అడిగినప్పుడు, అడిగినదానికి మాత్రం సూటిగా సమాధానం చెప్పాలి. గురువు చెప్తారు శిష్యడు ఆచరణ చెయ్యాలి. అంతే. ఇందులో ఇంకొక పాఠం కూడా వుంది, సంధ్యవార్చడం అనేది విధ్యుక్త ధర్మం. ఇంత చిన్న విషయాలని కూడా ఆచరించకుండా, పెద్ద పెద్ద విషయాలని చర్చ చేయటం వ్యర్థం. చర్చలకన్నా ఆచరణ శ్రేష్టం.
------------------------------------------------------------------------------------------------------------------
ఇట్లాగే ఒకసారి, హైద్రాబాదు చిన్మయ మిషన్ చిదాత్మ వారి తల్లితండ్రులతో వచ్చి స్వామితో మాట్లాడుతున్నారు. ఎదో అవసరం వచ్చి, స్వామి అమ్మయ్య ట్రస్ట్కు సంబంధించి విసిటింగ్ కార్డులు వున్నా పెట్టె తెమ్మని అడిగారు. నేను వెళ్లి తెస్తూ ఆ పెట్టె మీద పై మూతని తీసి కింది మూత కింద పెట్టి ఇచ్చాను. స్వామికి మూత తీసుకోకండ కార్డులు ఇవ్వటానికి సౌకర్యంగా ఉంటుందని నా ఆలోచన. స్వామి టక్కున, పైన మూత లేదని అడిగి, మందలించారు. మూడవ ముఖ్యమైన పాఠం, గురువు ఏది చెపితే దానిని తూ.చ. తప్పకుండ ఆచరించాలి. మన స్వబుద్ధితో మార్పులు చేయకూడదు.
స్వామి దగ్గర ఎవరి స్వభావానికి సరిపడ శిక్షణ వారికి ఉంటుంది. మన వ్యక్తితత్వంలోగాని, స్వభావంలోగాని ఏవైనా లక్షణాలు దిద్దాలంటే దానికి సరిపడ అనుభవాన్ని ఇచ్చి మార్పు తీసుకువచ్చేటువంటి శిక్షణ ఇవ్వడం కేవలం ఒక గురువుకే సాధ్యం. ఇది ఒక తరగతిలో అందరికి ఇచ్చే సార్వజనీనమైన శిక్షణ కాదు. స్వామి ఇచ్చిన ఆ అనుభవాన్ని, అందులో పాఠాన్ని, చాల శ్రద్దగా గుర్తుపెట్టుకుని, ఒకటికి వందసార్లు విచారణ చేసి, ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఒక మనిషి స్వభావంలో మార్పు రావటం అనేది చాల నిదానమైన, కఠినమైన పరిణామం. అందులోనూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే మరింత కఠినం.
-----------------------------------------------------------------------------------------------------------------
దర్గాకు రావటం మొదలుపెట్టిన కొత్తల్లో పగలువచ్చి దర్శనం చేసుకొని సాయంకాలం వెళ్ళేవాడిని. ఒకరోజు మధ్యాహ్నం అనంతకల్యాణ మండపంలో కూర్చుని ఉండగా, మనసులో తప్పుడు ఆలోచన రావటం మొదలైంది. సప్తవ్యసనాలు ఆచరణ చేసే చోట్లకు వెళ్తా కూడా ఆలోచన అంత బలంగా రాదు. అటువంటిది ఒక సద్గురువు ఆశ్రమంలో ఇటువంటి ఆలోచన రావటం ఏమిటి? కొంత నిగ్రహించి గురువు పాదాలమీదో, భగవంతునిమీదో ధ్యాస పెడదామని ప్రయత్నం చేసే కొద్దీ ఈ ఆలోచన మరింత బలంగా ఆడుతున్నది. ఇంతలో ఠక్కున స్వామి ఎదురుగ నిలబడి "నాయన, మనసు ఈగవంటిది. అన్నం మీదా వాలుతుంది పెంట మీదా వాలుతుంది" అన్నారు. చాల ప్రస్ఫుటంగా తెలుస్తున్నది, స్వామి ఒక తెరచిన పుస్తకంలో పేజీ చదువుతున్నటుగా నా మనసులో ఆలోచనని చూస్తున్నారని. ఇది చాల సంవత్సరాల తరువాత చెన్నై గోవర్ధనగారు చెపితే తెలిసింది. స్వామి చెప్పేవారు "నాయన, నువ్వు బాలు వేస్తే నేను బ్యాటు ఆడుతా. నువ్వు బ్యాటు ఆడితే నేను బాలు వేస్తా" అని. ఈ మాట స్వామి చెప్పగా నేను కూడా ఒకటిరెండుసార్లు విన్నాను కానీ, అప్పట్లో దాని భావం అర్థం కాలేదు.
-----------------------------------------------------------------------------------------------------------------
సత్యసాయిబాబా సమాధి చెందిన రోజు నేను దర్గాలోనే వున్నాను. అయన రూపం మరుగవటానికి కొద్ది రోజుల ముందు నుంచి వార్తాపత్రికలలో వస్తున్నది, అయన పరిస్థితి విషమంగా వుంది అని. దర్గా రాగానే మాటల సందర్భంలో గోవర్ధనన్నతో ఆ మాట చెప్పను. ఆ రోజు, ఉదయం ఆరతి అయినాక 7:45 AM ప్రాంతంలో, ఎప్పటి మాదిరే స్వామి అమ్మ సమాధి మందిరం ముందు కూర్చుని వున్నారు. గోవర్ధన్ అన్న వచ్చి స్వామికి వార్త తెలియచేసినాడు. స్వామి ఒక్క క్షణం కళ్ళుమూసుకుని సంభాళించుకుని, పక్కనే ఉన్న పంచాంగం తీసి చూసినారు. ఆ రోజు ఆదివారం, సప్తమి తిథి, నాకు నక్షత్రం గుర్తులేదు..మూడు కూడా సూర్యనారాయణునికి చెందినవి. స్వామి అన్నారు "అయన సూర్యనారాయణుని వంటివాడు. మనము మిణుగురు పురుగులం". ఈ విషయాన్నీ మనము అయన ఎక్కువా, ఈయన ఎక్కువా అని చూడకూడదు. ఇది స్వామికి తోటి సిద్ధపురుషులందు కల గౌరవం, ఔదార్యానికి మచ్చుతునక.
------------------------------------------------------------------------------------------------------------------
ఒక సందర్భంలో, స్వామి చెంత శంకరులవారి భజగోవిందం శ్లోకాలని చదువుతున్నాను, కొంత చదివినాకో పూర్తిగా చదివినాకో గుర్తు లేదుకానీ, స్వామి అన్నారు, "నాయన, ఏది ఎక్కడ ఉపయోగపెట్టాలో అది అక్కడ ఉపయోగపెట్టాలి."
------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment